18.10.10

మనుషులమైనందుకైనా నవ్వుదాం.....!!!

           నవ్వు, పువ్వు కేవలం ప్రాసపదాలే కాదు. సరూప, సమభావ పదాలు కూడ. పువ్వు పూసిన చెట్టు నలుగురినీ ఆకర్షించినట్లే, నవ్వే మనిషి చుట్టుపక్కలవాళ్ళను ఆకట్టూకుంటాడు. చిన్నపిల్లలు పసిడి నవ్వులు చిందించినట్లే, మొక్కలూ చాలావరకు పూలనవ్వులు విరబూస్తుంటాయి.
     పెద్దవాళ్లు నవ్వితే చులకనైతామని భావించినట్లే పెద్దవృక్షాలు చాలావరకు పూలుపూయవు. కాలానుగుణంగా పూసినా, అవసరానికి చిరునవ్వులు చిందించే పెద్దమనుషుల్లాగానే చిన్న చిన్నపూలు పూస్తుంటాయి. పెద్దవాళ్లు అందునా అధికారంలో ఉన్నవాళ్లు నవ్వితే పలుచనౌతామని, నవ్వకపోవడం హోదాకు మొదటి లక్షణంగా భావిస్తుంటారు. ఈ కోవకు చెందిన ఓ అధికారి ఆఫీసులో నవ్వక, ఇంట్లో నవ్వితే అదే అలవాటై, పొరపాటున ఆఫీసులోను నవ్వవచ్చుననే భయంతో ఇంట్లోను నవ్వక, అట్లా ఉద్యోగ జీవితమంతా నవ్వుకు దూరమై ఎప్పుడూ చిటపటలాడుతూ గడిపాడు. ఆయన కనీసం పదవీ విరమణ తర్వాతైనా నవ్వాలనుకున్నాడు. కాని అదీ సాధ్యపడలేదు. అన్నాళ్లు ఆయనను భరించిన పెళ్లాం,పిల్లలు వాళ్ల చేతుల్లోకి పగ్గాలు రావడంతో వాళ్లూ చిటపటలాడుతుంటే తానెలా నవ్వగలడు. తన గదిలో అద్దం ముందు నిలుచుని నవ్వాలనుకున్నాడు. ఆయన నవ్వుతున్నాడేగాని అద్దంలో ఆయన ప్రతిబింబం నవ్వడంలేదు. అద్దాన్ని మార్చాడు, కాని ప్రతిబింబం మారలేదు.                                        పిల్లలు నవ్వుతున్నట్లే పిల్లకథలూ మనలను గిలిగింతలు పెడుతాయి. పెద్దకథలట్లా కాదు పెద్దల్లాగానె గంభీరంగా ఉంటాయి. నవ్వు నాలుగు విధాల చేటని ఢంకా బజాయిస్తుంటాయి. మహాభారతం కావడానికి ద్రౌపది నవ్వే కారణమని మన పెద్దలు తీర్మానిస్తుంటారు. అట్లా అని వాళ్లు హాస్యాన్ని చిన్నచూపు చూశారని కాదు. గౌరవభంగం కాకుండా, జీవితంలో బావ-మరదళ్లు, వదిన-మరదళ్లు లాంటి బాంధవ్యాల బాసటగా హాస్యం అల్లుకోవాలని ఆశించారు. కాని ప్రస్తుతం అది వెర్రితలలు వేస్తున్నది. ఇప్పటి సినిమాల్లో తండ్రి-కొడుకు, గురువు-శిష్యుడు లాంటి గౌరవ సంబంధాల్లోను వెకిలిహాస్యం చొప్పిస్తున్నారు. ఇదే మాట తెలిసిన మిత్రునితో అంటే "ఇప్పుడంటే ఏదో హాస్యసన్నివేశాల కోసం తీస్తున్నాం. ముందు సినిమాలే తీశారండీ-- పరమానందయ్య శిష్యుల కథ సంగతేంటి" అన్నాడు. పరమానందయ్య శిష్యుల కథలో శిష్యులు తెలివి తక్కువతనంతో చేసే పనులు నవ్వు తెప్పిస్తుంటాయి. కాని, ఎక్కడా వాళ్లు ఇప్పటిలా గురువుతో అసభ్యంగా ప్రవర్తించడం కనిపించదు. సమాజంలో విలువలు మృగ్యమౌతున్నాయని సినిమాల్లోను విలువలకు తిలోదకాలు విడువడం మంచిదా? ఆలోచించాలి.


        టీవి చానళ్ల చాళ్లలోపడి హాస్యమూ విషపుష్పాలే పూస్తున్నది. ఊకదంపుడు హాస్యం, సంబంధాలను మంటగలిపే జోకులే ఎక్కువ. నేనొకసారి ఓ క్లబ్బు వాళ్లు నిర్వహించిన హాస్య కార్యక్రమం ఎట్లా ఉంటుందో చూద్దామని వెళ్లాను. నా పక్కన ఓ పెద్దమనిషి కార్యక్రమం అయ్యేదాక శిలాప్రతిమలా కూర్చున్నాడంతే, ఎవరి జోకుకు స్పందించకుండా, కారణమడిగితే "ఏం నవ్వుతాం చెప్పండీ! అన్నీ కాపీ జోకులు, "అట్టహాసమే ఎక్కువ పేజీలన్నీ అవే, కొన్నేమో పలచన, కొన్ని చర్వితచరణం, ఒక్కటైనా కొత్తది పేలితేకదా, నవ్వు రావడానికి" అన్నాడు. ఇంకొకాయన, ఎవరో చెబుతుంటే మాత్రం వాహ్వా, వాహ్వా.. అంటూ అందరినీ ఉత్తేజపరిచేలా చప్పట్లు కొట్టాడు. మిగతావాళ్లవి అంతకన్నా బాగున్నా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నాడు. విషయమడిగితే, వినీ..వినీ.. విసుగెత్తిపోతున్న జోకులే ఏదో మా మిత్రుడిని ప్రోత్సహించాలని కొట్టాను. ఎన్నిసార్లు విన్నా మళ్లా వినాలనిపించేవి మన పాతవాళ్లవే. తుపాకి రాముడు, పోలిగాడు, గందోలిగాడు, బుడ్డర్ఖాను ఏ వేషమైనా జానపద కళారూపాలే గొప్పవి. వృత్తులు, వృత్తికళలు చితికి పోయాయి" అని చింతించాడు. ఆ క్లబ్బు సభ్యులను చూస్తుంటే నాకు ఒక పాత కథ గుర్తుకొచ్చింది.
          పూర్వం వినోదం అంటే పడిచచ్చే ఓ రాజు, తన సభ లో "విదూషక దిగ్గజాలను" నియమించుకున్నాడు. ఆయన గారికి ఒకసారి తన రాజ్యంలో ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారా తెలుసుకోవాలనిపించింది. భటులు కొందరిని పిలిచి "రాజ్యం నలుదిక్కులా గాలించండి. ఎక్కడైనా నవ్వడం ఎరుగనివాడు ఒక్కడున్నా పట్టుకొని రండి" అని పంపాడట. ఒక భటుడు తప్ప మిగిలినవారు రాజ్యమంతటా గాలించారు. ఎక్కడా ఎవరూ దొరకలేదు. వుట్టి చేతులతో వచ్చారు. అందరూ తమ అనుభవాలు వివరించారు. చివరగా ఎక్కడా వెతకని భటుడు,"రాజా! మీకు కోపం రాదంటే ఒక మాట చెబుతాను. మీ పాలనలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారు. అటువంటప్పుడు నవ్వని వాళ్లు ఎవరూ ఉండరని వెతకడం దండగని ఊరుకున్నాను" అన్నాడు. రాజుకు కోపంవచ్చింది. ఏదో అనేలోగా, "రాజా! నాకు ఒకరు కాదు ఎనిమిది మంది నవ్వురానివాళ్లు కనిపించారు" అని చెప్పాడు. రాజు ఆతృతతో "ఎవరు వాళ్లు? ఎక్కడా?" అనడిగాడు. ఎవరోకాదు మహారాజా, మన ఆస్థాన విదూషకులే అని చెప్పాడు. రాజుకు, విదూషకులకు కోపం తారాస్థాయికి చేరింది.  "నీకసలు బుద్దుందా? నన్ను, నా తో పాటు సభలో మీ అందరినీ తమ చమత్కార సంభాషణలతో నవ్విస్తున్న మన విదూషకులకు నవ్వడం తెలియదంటావా? ఎవరక్కడ?" అనడంతో "ప్రభువులు మన్నించాలి. మన విదూషకులను దూషించాలని కాదు. వారు మహా పండితులు. అయిటే వాళ్లు ఒకరిని మించి ఒకరు తమరిని నవ్వించాలనే ప్రయత్నంలో వాళ్లకు ఒకరంటే ఇంకొకరికి గిట్టడం లేదు.అసూయతోనో, అహంతోనో తప్ప నవ్వుతూ ఉండలేక పోతున్నారు. వాళ్లు నవ్వించగలిగినా మనస్ఫూర్తిగా నవ్వలేకపోతున్నారు" అని భటుడు మనవి చేశాడు. రాజుకు కనువిప్పు కలిగింది. విదూషకుల జీవనానికి తగిన ఏర్పాట్లు చేసి, "విదూషక పీఠాన్ని" రద్దు చేశాడు. భటుడిని గౌరవించాడు.
        నవ్వు ఒక మంచి భావనకు ఉప్పొంగే మనసు కనబరిచే చేష్ట. పక్షులు, జంతువులు బాధను, కోపాన్ని వ్యక్తం చేయగలుగుతాయి. ఆడుకోగలుగుతాయి,కానీ నవ్వలేవు. మనిషి మనిషిగా నిరూపితం కావడానికైనా మనస్ఫూర్తిగా నవ్వాలి.
(4 ఏప్రిల్ 2010- ఆదివారం వార్త లో వినోదం శీర్షికన ప్రచురితం.)       

2 comments:

karlapalem Hanumantha Rao said...

నవ్వు మీద చెప్పిందే చెప్పి ఏడిపించే వాళ్ళను చాలా మందిని చూసాను.మీరు రాసిన పాతిక వాక్యాలలో నాకు సంబదించి నంతవరకు అన్ని కొత్త విషయాలే వున్నాయండి !చాలా బాగుంది...మీ రచనల లాగానే మీ బ్లాగ్ కూడా!

సుభ/subha said...

చాలా బాగుందండీ.. ముఖ్యంగా మొదట్లో చెప్పిన పువ్వుకీ, నవ్వుకీ సంబంధం, మరియు కథ...