13.7.11

తెలంగాణ సారు





ఒకని చూపు
ఇవాళ ప్రతి కంటిన
ఒకని మాట
ఇవాళ ప్రతి కంఠాన
పల్లె గల్లీ ఢిల్లీ
బొగ్గుబాయి బొంబాయి దుబాయి
అరబ్బు అమెరిక
అంతటా అదే నిక్వాణం
తెగని బలువని పోరులో
ఎన్ని తీగలు తెగినా
తెగని ఒకే ఒక తీగ
భూనభోంతరాళాలంతటా
ప్రసరిస్తున్న...ప్రతిధ్వనిస్తున్న...
తెలంగాణ వీణానిక్వాణం

ఆ మాటనే నిషేధించిన చోట

ఆ మాట అనడానికి
ఎవరూ సాహసించని పూట
ఆ మాట పెగలకుండా
అంతా నోళ్లు కుట్టేసుకున్న
కలాలు గళాలు కట్టేసుకున్న
మీడియా ఝూటాస్వేఛ్ఛా కాలాన్ని కాలుస్తూ...
అంటుకున్న ఎలగడ మంట

ఇవాళ ప్రతి పూట...

ప్రతి నోట...ప్రతి చోట...
ఏ పేపర్ తిప్పిన ఆ మాట పై
చూపు దొరలకుండా ఉండడం కుదరదు.
ఏ ఛానల్ తిప్పిన ఆ మాట
చెవి సోకకుండా రోజు గడవదు.
అసుంటి తెలంగాణ పోరు
మంటను ఆరకుండా
మాటలో..మనసులో..
నెత్తుటిలో..అక్షరంలో..దాచుకున్న
మూడు తరాల పోరాటాల వారధి
అరవై ఏళ్ల ఉద్యమపథ ఒంటరి రథ సారథి
నాలుగ్గోడల పాఠాన్ని
నాలుగు కోట్ల కంఠోపాఠం చేసిన
తెలంగాణ సారు..అతడు...
జై తెలంగాణమంటూ నినాదించే వేళ
మనకు మొదటి పదమై మతి కొస్తడు

నిరంతర పోరాటమే

నిజమైన విజయమనడానికి
సాక్షిగా మనతో నిలిచే ఉంటడు...!

No comments: