18.11.10

శ్రీ శ్రీ "నవకవిత " కు పేరడీ


పాలిట్రిక్స్
విపరీతం, విచిత్రవేషం,
కుటిలత్వం, మనసునక్రౌర్యం,
తలతెగినా కారనినెత్తురు,
ఎదచోటున కదలని బండ,
గోడమీది పిల్లికి పోలిక,
అవసరానికి రెండో నాలిక,
కావాలోయ్ పాలిటిక్సుకి.


పాడెక్కినా చావనిస్వార్థం,
తలకెక్కిన సప్తవ్యసనాల్,
పొగలుగక్కు రౌడీయిజమూ,
పగలు రేయి కొంగజపమూ,
పగబట్టే ఫ్యాక్షనిజమూ,
కొనితెచ్చిన లారీ జనమూ,
కావాలోయ్ పాలిటిక్సుకి.


ఊసరెల్లిలా రంగులు మార్చుట,
మొసలిలా కన్నీళ్లుకార్చుట,
ఓట్లవేళ పలు హామీలు,
సీటెక్కితే ఎగనామాలు,
ఉమ్మేసినా తుడుచుకోవడం,
నమ్మేవారి గొంతు కోయడం,
కావాలోయ్ పాలిటిక్సుకి.


తిట్టడమూ, తిట్లుతినడమూ,
వేలు చూపడం,కాలు అడ్డడం,
ఎగదోయడమూ, ఉసిగొల్పడమూ,
మొక్కుతునే కాళ్లు లాగడం,
తనవారికే సీట్లు ఇవ్వడం,
తమ బతుకునే దిద్దుకోవడం,
కావాలోయ్ పాలిటిక్సుకి.

***************************************************


నవ కవిత
సింధూరం, రక్తచందనం,
బంధూకం, సంధ్యారాగం,
పులిచంపిన లేడినెత్తురూ,
ఎగరేసిన ఎర్రనిజెండా,
రుద్రాలిక నయనజ్వాలిక,
కలకత్తా కాళికనాలిక
కావాలోయ్ నవకవనానికి.

ఘాటెక్కిన గంధక ధూమం,
పోటెత్తిన సప్తసముద్రాల్ ,
రగులుకునే రాక్షసిబొగ్గూ,
బుగులుకునే బుక్కాగుంఢా,
వికసించే విద్యుత్తేజం,
చెలరేగిన జనసమ్మర్ధం
కావాలోయ్ నవకవనానికి.


రాబందుల రెక్కల చప్పుడు,
పొగగొట్టపు భూంకారధ్వని,
అరణ్యమున హరీంద్రగర్జన
పయోధర ప్రచండఘోషం,
ఖడ్గమృగోదగ్ర విరావం
ఝంఝానిల షడ్జధ్వానం.
కావాలోయ్ నవకవనానికి.


కదిలేది, కదిలించేది,
మారేది, మార్పించేది,
పాడేది, పాడించేది,
మునుముందుకు సాగించేది,
పెనునిద్దుర వదిలించేది,
పరిపూర్ణపు బ్రతుకిచ్చేది
కావాలోయ్ నవకవనానికి.

1 comment:

సుభ/subha said...

తమ బతుకునే దిద్దుకోవడం,
కావాలోయ్ పాలిటిక్సుకి.
చాలా చక్కగా చెప్పారండీ.. ఇలాంటివి ఎన్ని చూస్తే,చదివితే బుద్దొస్తుంది ఈ పాలి 'ట్రిక్సు ' నడిపించే నాయకులకి.