22.11.10

హైదరాబాదులో రోడ్ల పక్కన గిరిజనులు,పల్లెప్రజలు అమ్మే సీతాఫలాల బేరాలు, వాళ్ల జీవన స్థితిగతులు చూసి,రాసిన కవిత

            

             సీతాఫలం


 

తడిలేని
నగరపు రాదారి ప్రవాహాల
ఇరు దరుల్లో...ఒక చూపు కోసం
ఒళ్లంతా పచ్చపచ్చగా
మిటకరించే మిడిగుడ్ల
అడవి ఆశలు

 
కడుపులో పొదువుకునే
భూమితల్లి ఆసరాగా
పచ్చగా కొమ్మ సాగే బతుకు తీపికలల
గువ్వపు మాయపొరల మధ్య
కడుపులో కదిలే పిండాల తలపులు


 
కరడుగట్టిన రాతినేలకు తలలు బాదుకునే
ఉమ్మేసిన గింజల్లా చెల్లాచెదరౌతాయి
ఊడ్చేసిన చెత్తగా
మురికినరకమౌతాయి


 
చెట్ల బరిగెల గాయాలకన్నా
బరితెగించిన రంగురంగుల కాంతుల వలల
బేరాల కోరలు చేసిన
గాయాలే సలుపుతాయి

కదలివచ్చిన భారాలకన్నా
ఖాళీగుల్లలుగా తరలిపోయే
నిట్టూర్పులే పెనుభారమౌతాయి


 
కాంక్రీటు అరణ్యంలో
నాణెం తప్ప
మరేది నాటుకోదు
ఈడ
నేలరాలే గింజకే కాదు
కన్నీటి బొట్టుకు
మెత్తబడే
మట్టి కరువు.

4 comments:

కెక్యూబ్ వర్మ said...

కదలివచ్చిన భారాలకన్నా
ఖాళీగుల్లలుగా తరలిపోయే
నిట్టూర్పులే పెనుభారమౌతాయి

ఈ వాక్యాలు హత్తుకున్నాయి. గిరిజనులు, శ్రామికుల పట్ల సంఘీభావంగా రాసిన మీ సహృదయానికి ధన్యవాదాలు..

karlapalem Hanumantha Rao said...

ఈ కాంక్రీటు అరణ్యంలో
నాణెం తప్ప
మరేది నాటుకోదు
ఈడ
నేలరాలే గింజకే కాదు
కన్నీటి బొట్టుకు
మెత్తబడే
మట్టి కరువు...!
ఇక్కడొక అద్భుతమయిన ఉడుకు నెత్తురు కవిత ఉరకలెత్తుతో వచ్చి పడుతుంది .ఆ జలపాతపు హోరులొ నాకు అథోజగత్ సహోదరుల జీవనపోరాట హా..హూఁ౦ కారాలే వినపడుతున్నాయ్ !

అరుణ్ కుమార్ ఆలూరి said...

చెట్ల బరిగెల గాయాలకన్నా
బరితెగించిన రంగురంగుల కాంతుల వలల
బేరాల కోరలు చేసిన
గాయాలే సలుపుతాయి

---అందంగా ప్యాక్ చేసి, ఏ.సి. "ఫ్రెష్"ల్లో అమ్మితే, నోర్మూసుకుని ఎంత రేటు ఎక్కువుంటే, అంత మేలిమిదని భ్రమపడి కొంటారు.. అప్పుడే కోసుకొచ్చినవి రోడ్డు పక్కన, రైల్లల్లో అమ్మితే వారి కష్టాన్ని బేరాలాడి అవమానిస్తారు.

Hemalatha said...

సీతా ఫలాల సీజన్ అవుతూ ఉండగా మీ సీతాఫలం కవిత కమ్మని రుచి వెనక వున్న ఆర్తిని చూపించింది.