15.1.13

చిత్రమైన శాపం

                 
కొత్తగా చెప్పాలనుకుంటా
అక్షరాల బదులుగా నక్షత్రాలను లిఖిస్తూ
వాక్యాల స్థానంలో మెరుపుల్ని కట్టేయాలనుకుంటా
పాత మాటలు, వాక్యాలు
వేటి పొడ పడకుండా
దూరంగా పరుగెత్తుతా
వాటికందకుండా పారిపోతా
అయినా...
మొసపోసుడు తప్ప
ఏం మిగిలిందని
చంకన వెతకని బిడ్డలా
భుజాన మోస్తూ
అవే పాత మాటలూ.. వాక్యాలు

అలంకారాలు,వర్ణనలూ
ఇవేవి వద్దనుకుని
సాదాసీదా వాక్యంగా
గడిపేద్దామనుకుంటా
ఇకపై అట్లాగే ఉంటానని
శపథమూ చేయాలనుకుంటా
ఏం శాపమో...!
జాగ్రత్తగా అడుగేస్తున్నాననుకుంటూనే
జర్రునజారి... చిత్రంగా
 నాకు తెలియకుండానే
ఏదో ఒక "పోలిక" నోట్లో చిక్కిపోతా

మౌనంగా ఆమె ముఖంలోకి చూస్తూ..
ఆమె కళ్ళ నీలిమలో లీనమౌతూ
శబ్దధూళి సోకని
కవిత్వం చెప్పాలని వుంది అన్నా..
ఆమె ముసిముసి నవ్వులతో.
ఓరగా చూస్తూ...
నన్నుదాటి వెళ్ళిపోయింది
నాటి నుంచి నేను వెతుకుతునే ఉన్నా
అడుగుజాడలేమైనాయో..
అక్షరాలు కనిపిస్తున్నాయి
ఆమె పాదాలేమో కాని
పద్యపాదాలైతే స్ఫురిస్తున్నాయి.