8.3.13

ఒక సాంధ్యకవిత

ఒక సాంధ్యకవిత

ప్రత్యూష పవనపు తాకిడికి
పగిలిన మధుపాత్ర - రాత్రి

మరుపు శకలాలు గుచ్చుకుంటున్నా..
ఒలికి ఇంకిన స్వప్నపు తడిస్పర్శకే
మనసంతా కమ్ముకున్న హాయి

అర్థాల నిఘంటువు అద్దానికి
ముఖం తప్ప అంతర్ముఖమేం తెలుసు

చీకటి మూసిన రెప్పల్లో
సుప్తచేతన లిఖించిన
కంటిజీరల కవిత్వభాష
ఏ అద్దానికి అందదు

ఎటుచూసినా వణికించే
పొగమంచు కుబుసం
పడమటికి చరచర పాకిన పామునీడ

కరెంటు దండాలపై
మూసిన రెక్కలు మూగబోయిన గొంతులతో
ఆరుతున్న గువ్వలు

మగతనిదురలో జోగుతున్న చెట్టు
అపుడే తెరవాలనిలేని
ఎగరలేని కొమ్మల మూసిన కనురెప్పల్లో
ఎగిరిపోవాలనుకునే కలలైన కొంగలు

మంచులో... మజ్జులో...
తనలో తాను ముడుచుకుని
పిడచగట్టిన సమస్త లోకం

ఇప్పుడు
ఒక్కసారి
రెండు దిక్కుల అంచుల్నిపట్టుకుని
విదిల్చేందుకు
చాచిన రెండు కిరణాలు చాలు

No comments: