17.3.13

అనుమాన పర్వం





ఇన్నాళ్లు బస్టాపుల్లో
బస్సు కోసమై చూసే కళ్లు
ఇప్పుడు బెదురు బెదురుగా
చుట్టూర చూస్తున్నయ్

ఎవరి తల్లో.... పెళ్లామో
తిండితోపాటు
ప్రేమనూ కూరి పెట్టిన
టిఫిను డబ్బాలనూ...

రోడ్డుపక్కన
సామాన్యులు తొక్కుతున్న సైకిళ్లనూ...

పాత సంచులనూ... కొత్త మనుషులనూ...
దేన్నీ... ఎవ్వరినీ... వదలకుండా..
తీక్షణంగా చూస్తున్నయ్

బస్సులో..
పక్కసీటు సాయిబు గడ్డంజుబ్బులో
ఏ బాంబు ఉందో..

నఖాబు మాటు
మసక మసగ్గా ఆ కళ్లు
ఏ ఉగ్రవాదివో...

ఇప్పటి దాకా మనకు పట్టని
ఇప్పుడేమో చెవులు రిక్కించి విన్నా
ఒక్కముక్కా అర్థంకాని భాషలో
ఆ కాటుక కళ్ల కుర్రవాడు
ఏ పాకిస్థానీతో మట్లాడుతున్నాడో....

ఆ నమాజు టోపీ తలలోంచి
ఏ కోడెతాచు బుసకొడుతుందో...

ఒక పెను విషాదం వెనుక
పేనుకుంటున్న పెను భూతం

మనసున పెంచుకున్న ముళ్లకంప
ఏదో తీరుగ బయటకు
పొడుచు కొస్తుంటే...

మనకు అక్కరలేని వాడు
ఉన్నా.. ఏదో అవసరం పూర్తివాడు
మనిషిగా గుర్తించడానికే మనం ఇష్టపడనివాడు

సలాంవాలేకుం...a
షుక్రియా..
భయ్యా.. చిచ్చా.. అంటూ..
ఎంత మాట కలిపినా...
మనసు పరిచినా..
ఎట్ల అలాయ్‍బలాయ్ చేసుకుంటం.
 

No comments: