7.9.13

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును స్వాగతిస్తూ కవి కొప్పర్తి

ఆంధ్ర జ్యోతి దినపత్రికలో వచ్చిన కవి కొప్పర్తి వ్యాసం ఇది.కొప్పర్తి "విషాద మోహనం" వంటి తాత్త్విక నేపథ్యం ఉన్న కవిత్వం రాశారు. వారు తణుకు, పశ్చిమ గోదావరి జిల్లాలో డిగ్రీకాలేజీలో రాజనీతి శాస్త్ర అధ్యాపకులుగా పని చేస్తున్నారు. రాష్ట్ర విభజనను ఆమోదించ లేకపోతున్న సీమాంధ్ర మిత్రులు ఇటువంటి మేధావులభావాల్ని అర్థం చేసుకుని, తమ మార్గాన్ని నిర్ణయించుకుంటారనే ఆకాంక్షతో..

భావ సాహసాలే భావికి బాటలు - కొప్పర్తి వెంకట రమణమూర్తి
August 30, 2013
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం ఒకనాటి ఆర్థిక విప్లవానికి తద్వారా సాంస్కృతిక పునరుజ్జీవనానికి పుట్టినిల్లయిన కోస్తాంధ్ర ప్రజల ఆలోచనా స్రవంతి గడ్డ కట్టిన వైనానికి నూతన ఆలోచనలకు తావివ్వనితనానికి నిదర్శనం. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని సీమాంధ్రులు అర్థం చేసుకోవాలి. తమ సంప్రదాయ ఆలోచనా విధానాన్ని విడిచి ఉద్యమానికి వేసిన సమైక్యం ముసుగును తొలగించాలి.
సీమాంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య రాష్ట్ర విభజన విషయమై జరుగుతున్న ఘర్షణ సంప్రదాయ, ప్రగతిశీల ఆలోచనా విధానాల మధ్య జరుగుతున్న సంఘర్షణగా కనిపిస్తున్నది. సమైక్యతను ఆశిస్తున్న సీమాంధ్రలో 'కలసి ఉంటే కలదు సుఖం' వంటి సంప్రదాయక ఆలోచనలతో పాటు రాష్ట్ర భక్తిని దేశభక్తిగా భ్రమ పెట్టుకుని తెచ్చుకున్న ఉత్తేజమూ, విభజన జరిగితే ఆర్థికంగా నష్టపోతామనే కలవరమూ కనిపిస్తుండగా తెలంగాణలో ఇతర ప్రాంతాలతో తమకు ఉన్న సాంస్కృతిక వైరుధ్యాలనూ ఆర్థిక వెనుకబాటుదనాన్నీ గుర్తించి విభజన వంటి సంప్రదాయేతర పరిష్కారాల కోసం ఉద్యమించడం కనిపిస్తుంది. ఇది అవగాహన లేని ఆదర్శానికీ, ఆదర్శంలోని డొల్లతనాన్ని బట్ట బయలు చేయడానికి వెనుదీయని సమకాలీన స్పృహకు జరుగుతున్న సంఘర్షణగా భావించవచ్చు.
తెలంగాణ రాష్ట్ర ప్రకటన తర్వాత సీమాంధ్రలో పెచ్చరిల్లిన ఆందోళనల వెనుక తెలంగాణ ఉద్యమం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, వారి ఆకాంక్షల పట్ల సీమాంధ్ర ప్రజల అవగాహనా రాహిత్యమే కనిపిస్తున్నది. దీర్ఘకాలంగా సమైక్యరాష్ట్ర పాలనలో తెలంగాణ నిరాదరణకు గురైందంటూ జరిపిన ఉద్యమమే సీమాంధ్ర ప్రజల నాయకుల నిరాదరణకు, ఉపేక్షకూ గురైంది. పదమూడు సంవత్సరాలు దాదాపు వేయిమంది యువకుల విద్యార్థుల బలిదానాలతో రక్తతర్పణమైన ఉద్యమం పట్ల కూడా సీమాంధ్ర మేధావులు నాయకులు ఎప్పటి లాగానే నిరాసక్తతను ప్రదర్శించారు. దాన్ని కొందరు రాజకీయనాయకుల స్వార్థపూరిత ప్రయోజనాల కొరకు జరుగుతున్న ఉద్యమంగా నిర్ధారించుకున్నారు తప్ప దాని వెనుక ఉన్న సైద్ధాంతిక వాస్తవిక సమకాలిక దృక్పథాన్ని గుర్తించలేక పోయారు. నూతన పరిశోధనలతో నవీన ఆలోచనలకు మార్గదర్శకత్వం చెయ్యాల్సిన సీమాంధ్ర విశ్వవిద్యాలయాలు సైతం పుక్కిటి వాసనల్నే వెదజల్లాయి.
ఫలితంగా సీమాంధ్రలో తెలంగాణ ఉద్యమం పట్ల వాస్తవ అవగాహన కొరవడింది. పర్యవసానంగా రాయలసీమ తెలంగాణ ప్రాంతాలను గానీ , అక్కడి జనజీవనాన్ని గానీ ఒక్కసారి కూడా తడిమిచూడని కోస్తాంధ్ర ప్రజల్లో ఎంతో మంది విభజనను వ్యతిరేకిస్తూ వీధుల్లోకి వచ్చారు. అప్పటివరకు విభజనను సమర్థించి కేంద్ర ప్రభుత్వానికి అనుకూల సంజ్ఞలిచ్చిన రాజకీయ పార్టీలు ప్రజల్ని చైతన్యపరిచి విభజనకు అనుకూల వాతావరణాన్ని ఏర్పరచవలసింది పోయి పరుగెత్తుకు వెళ్ళి ప్రజల వెనుక దాక్కున్నాయి. కేంద్రం ఎన్నికల ఎత్తుగడగా విభజన ప్రకటన చేసిందని ప్రకటించిన రాజకీయ పార్టీలు అదే ఎత్తుగడతో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సమర్థిస్తున్నాయి తప్ప ప్రజలకు వాస్తవాలే మిటో వివరించడం లేదు.
ఈ నేపథ్యంలో సమైక్యం అనేది కొందరికి ఆదర్శం కాగా మరికొందరికి వ్యతిరేక ఆదర్శం అయింది. ఆదర్శం అనేది అందరికీ ఆదర్శమే కావాలి. కానీ కొందరికి వ్యతిరేక ఆదర్శం అయినప్పుడు అది ఆదర్శం కాకుండా పోతుంది. ఆదర్శాలు సాపేక్షాలే కానీ నిరపేక్షాలు కావు. సాపేక్షాలైన ఆదరర్శాలను సరికొత్త స్థలకాలాలలో సరికొత్తగా నిర్వచించుకోవలసి ఉంటుంది. సమైక్యతను దీనికి అన్వయించి పునర్నిర్వచించుకున్నప్పుడు అందులో అంతర్లీనమై ప్రత్యేకతలను కోల్పోయిన విభిన్న అస్తిత్వాలకు సమైక్యత ఒక వ్యతిరేక ఆదర్శంగా ఉండడాన్ని గమనించవచ్చు. అక్కడ ఆ విభిన్నతల్ని కాపాడుకునే లక్ష్యసాధనలో విభజన ఒక ఆదర్శంగా రూపాంతర ం చెందడాన్ని గుర్తించవచ్చు . స్వాగతించవచ్చు . ఈ అవగాహన లోపమే ఇవ్వాళ సీమాంధ్రలో ఒక వ్యతిరేక ఉద్యమానికి దారి తీసింది.
తెలంగాణ ఉద్యమాన్ని ఉత్తరాధునిక (పోస్ట్ మోడరన్) దృక్కోణం నుంచి అర్థం చేసుకోవడంలో కూడా సంప్రదాయ సీమాంధ్ర పూర్తిగా విఫల మైంది. భూస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ పాదుకున్న సీమాంధ్రలో ఎనభైల తర్వాత ఆధిపత్య భావజాలాలకు వ్యతిరేకంగా వచ్చిన అస్తిత్వ ఉద్యమాల పట్ల సరైన సైద్ధాంతిక అవగాహన లేదు. ముఖ్యంగా మైనారిటీ ప్రాంతీయ ఉద్యమాలను సరైన పద్ధతిలో అర్థం చేసుకునే వారే కరువయ్యారు. ఐక్యత పేరుతో ఒక అభివృద్ధి చెందిన ప్రాంతమో, మెజారిటీ మతమో, అగ్రకులమో, పురుషాధిక్య సమాజమో ఆధిపత్యాన్ని చేజిక్కించుకుంటుందనీ, ఆ అభివృద్ధి చెందిన ప్రాంత భావజాలమే అందరి భావజాలంగానూ, ఆ ఆధిపత్య సంస్కృతే అందరి సంస్కృతిగానూ చెలామణీ అవుతుందన్న వాస్తవాన్ని మేధావులు కూడా అందిపుచ్చుకోలేక పోయారు. 'విభిన్నతల్ని మనం చైతన్య పరుద్దాం' అంటూ ఫ్రెంచ్ మేధావీ, ఉత్తరాధునికవాద సిద్ధాంతకర్త లియో తార్హ్ ఇచ్చిన చైతన్యం నుంచి కానీ 'శకలాలు మాత్రమే నేను నమ్మే రూపాలు'అన్న అమెరికన్ రచయిత బార్త్‌లోమే ఆవిష్కరణల వెలుగులో కానీ తెలంగాణ ఉద్యమాన్ని చూడడంలో వారు విఫలమయ్యారు. ప్రత్యేకతల ఆధారంగా విడిపోయిన శకలాలు క్రమంగా పరిపూర్ణరూపాలుగా పరిణమించే అనివార్యతలను దర్శించలేకపోయారు.
ప్రత్యేక అస్తిత్వాలను నిర్ధారించడంలో ఆర్థికాంశాలతో పాటు సాంస్కృతికాంశాలు కీలకపాత్రను పోషిస్తాయని కూడా సీమాంధ్రులు గుర్తించలేకపోతున్నారు. అందువల్లనే తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన సీమాంధ్ర మేధావులంతా తెలంగాణలో జరిగిన ఆర్థికాభివృద్ధిని చూపుతున్నారే గానీ రెండు ప్రాంతాల సాంస్కృతిక వైరుధ్యాలను గురించి ప్రస్తావించడం లేదు. కోస్తాంధ్ర భాషా సంస్కృతులే మొత్తం తెలుగు వారి భాషాసంస్కృతులుగా చెలామణీ కావడం గురించి మాట్లాడడం లేదు .సమైక్యంలో సాధించే ఆర్థికాభివృద్ధి గురించిన ఘోషే తప్ప కోల్పోయే సాంస్కృతిక అస్తిత్వం గురించిన ఊసే ఉండడం లేదు. భౌతిక రూపాలైన ఆర్థిక అసమానతల్ని తొలగించగలం గానీ నైరూప్యాలైన సాంస్కృతిక అసమానతల్ని రూపు మాపడం అంత తేలికకాదని గుర్తించడం లేదు.
తెలంగాణ ఉద్యమం విభజన కోసం జరిగిన నిర్దిష్ట ఉద్యమం కాగా సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళన సమైక్యం పేరుతో హైదరాబాద్ కోస ం జరుగుతున్న ప్రచ్ఛన్న పోరాటమే. ఒక ఉద్యమం తాను ప్రకటించుకున్న లక్ష్యం కోసం కాక వేరే లక్ష్యం కోసం జరుగుతూ ఉండడం అతి పెద్ద ప్రజాద్రోహం. ఉభయ ప్రాంతాల ప్రజలు హైదరాబాద్‌ను చూసే కోణంలో వైరుధ్యాలు కనిపిస్తున్నాయి. సీమాంధ్రుల ఆలోచనలు హైదరాబాద్‌లోని ఆర్థిక వనరుల మీద, ఉద్యోగ అవకాశాల చుట్టూ తిరుగుతూ వాటిల్లో తమ భాగాన్ని శాశ్వతంగా దక్కించుకోవడం మీద కేంద్రీకృత మయ్యాయి. హైదరాబాద్‌తో వారిది 58 సంవత్సరాల సంబంధం. అది ప్రధానంగా ఆర్థికానుబంధం. కానీ తెలంగాణ వారికి హైదరాబాదుతో ఉన్నది నాలుగు శతాబ్దాల చారిత్రక సాంస్కృతిక భావోద్వేగాలతో కూడిన బాంధవ్యం. ఒకరిది భయం. ఒకరిది బెంగ. ఒకరికి అది తాము అభివృద్ధి చేసిన నగరం. సంపదల నిలయం. మరొకరికి అది సంక్రమించిన సాంస్కృతిక వాస్తవం.
ఎవరైనా సంపదను పంచుకోగలరు గానీ వారసత్వాన్ని పంచుకోలేరు. తమకు ప్రత్యేక డిమాండ్లు లేవంటూ ప్రభుత్వ ఉద్యోగులు సమైక్యాంధ్ర నినాదంతో చేపట్టిన సమ్మె కూడా హైదరాబాద్‌లో వారి అస్తిత్వానికి ముప్పు వాటిల్లుతుందని వారు భావించడమే కారణం. దశాబ్దాలుగా హైదరాబాద్‌లోనే ఉద్యోగం చేస్తూ అక్కడే ఇళ్ళు కట్టుకొని పిల్లల్ని చదివించుకుంటూ నగర ప్రయోజనాలు పొందుతున్న పది శాతం మంది ఉద్యోగులు విభజన తర్వాత కొత్త రాజధానికి వెళ్ళేది లేదని మారాం చేస్తున్నారు. వారి ప్రయోజనాలను కాపాడడానికి దశాబ్దాలుగా జిల్లాల్లో గ్రామాలలో ఉద్యోగాలు చేస్తూ సరైన విద్య వైద్య సదుపాయాలు లేక, తమ పిల్లల్ని పది రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టి హైదరాబాద్‌లో చదివించుకుంటూ రోగం వస్తే రొష్టు పడుతూ అక్కడికే పరుగెత్తి కెళ్ళి వొళ్ళు ఇల్లూ గుల్ల చేసుకునే 90 శాతం మంది ఉద్యోగుల సమ్మె కట్టడం విచిత్రం. దగ్గరగా వచ్చే రాజధానినీ క్రమంగా లభించే సదుపాయాల్ని కాదని ఉద్యోగులు ఈ సమ్మెకు దిగడం ఒక వైరుధ్యం.
సమైక్యం అనే ఆదర్శపు మత్తులో మాత్రమే అది సాధ్యపడుతుంది. మత్తులో ఉన్నప్పుడు బాధ తెలియదుకదా! ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం ఒకనాటి ఆర్థిక విప్లవానికి తద్వారా సాంస్కృతిక పునరుజ్జీవనానికి పుట్టినిల్లయిన కోస్తాంధ్ర ప్రజల ఆలోచనా స్రవంతి గడ్డ కట్టిన వైనానికి నూతన ఆలోచనలకు తావివ్వనితనానికి నిదర్శనం. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని సీమాంధ్రులు అర్థం చేసుకోవాలి.తమ సంప్రదాయ ఆలోచనా విధానాన్ని విడిచి ఉద్యమానికి వేసిన సమైక్యం ముసుగును తొలగించాలి. రెండు రాష్ట్రాల ఏర్పాటుకు అంగీకరించాలి. న్యాయబద్ధంగా రావలసిందేదో అడగాలి. సాధించుకోవాలి. రాజ్యాంగపరంగా రావలసిన రక్షణలు పొందాలి. వైషమ్యాలు విడనాడి పురోగమించాలి. అట్లాకాక సమైక్య ఉద్యమం కేంద్రప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేంతగా విజయవంతమైతే సీమాంధ్రులు చరిత్ర పురోగమనాన్ని మరికొంతకాలం నిరోధించిన అపకీర్తిని మూటగట్టుకుంటారు. ఒక వ్యతిరేక ఉద్యమాన్ని గెలిచిన విషాద సందర్భాన్ని సంబరంగా జరుపుకుంటారు.
-కొప్పర్తి వెంకట రమణమూర్తి


1 comment:

Harish said...

I really loved this post.