7.9.13

హైదరాబాదీ

When you are in Rome be like a Roman

* *

కలిసిన మనసుల ప్రేమ చిహ్నం హైదరాబాదు

కలుపుకున్నా నీ బాగునే కోరింది

నీ "భాగ్య" నగరమైంది.

ఒంపు సొంపులకు కన్నుచెదిరి

ఒక్క భాషని, ఒల్లెకపు మాటన జంట కలిపి

తౌరక్యాంధ్రమని ఎక్కిరిచ్చినా ఏగింది నీతో.

ఒక్క జాతని, దిష్టిబొమ్మైన తెలుగు తల్లి ఎనుక నత్కి

సెక్రెటరియేట్ల దొంగోలె సొచ్చి దొరవైనా

వొంగి సలాము చేసింది.

మాటన్నా, మర్యాదన్నా నీదని

మీడియా కత్తెరలతో కొండనాల్కెను కోసినా..

బుస్సున పొంగు సోడానీల్లతో

కస్సున కడుపున కాటేసినా.. సైపింది.

మా అంజయ్య మాటను

బాక్సుకట్టి నిలవెట్టి

దినామూ.. బస్కీలు తీయించినా..

తన పలుకును రౌడీ చేసి

వెండిపర్దా కెక్కించినా.. మండలే.

అల్విన్,డీబీఆర్,ఐడీపీఎల్

ఎన్నో ఫ్యాక్టరీలు కూలగొట్టి

నోట్ల మన్నుగొట్టీనా..

నీ కంపినిలల్ల..

తన మాట వినుడుకే మొఖం తిప్పినా.. నిలదీయలే.

విగ్రహాలను నిమజ్జనం జేసుడే తెలిసిన

హుస్సేను సాగరు

హృదయం తల్లడమల్లడమైనా

టాంకుబండు మీదున్న

నీ పితృదేవతలకు సాష్టాంగవడ్డది.. రోజూ.

పటాంచెర్ల

నువ్వు హాలాహలం కక్కుతున్నా

ఔషధామృతమే పంచుతున్నది.

బంజారహిల్సును రోడ్లురోడ్లుగా..

కూకట్పల్లిని ఫేజులుఫేజులుగా.. తుకుడలుజేసి

బస్సెనక బస్సుగట్టి "ఆంధ్ర"నే దించుతున్నా

కలిసే నడుస్తున్నది కాదంటలే.

నిజాము గుంజుకున్న పేదోల్ల బూములు,వక్ఫుబూములు

యాడజూసినా ధగధగ మెరుస్తున్న నీ పాదమే.

ఇంత అన్నాయం జేసిన నువ్వు

హస్తం నుంచి అన్నం మెతుకన్న తల్లెల రాలక మునుపే..

న్యాయం కావాలంటున్నవు

నా బతుకు అన్నాయమై పోతదని

డిల్లీకెక్కి లొల్లి పెడుతున్నవు.

"దేశమంటే మట్టి కాదన్న"

నీ మట్టి కవినే యాది మరిచినవ్

ఈడి బూములనమ్మాల్ననే..

మనుషుల నమ్ముతలే.

హైదరాబాదు చుట్టూ

వోఆరారు సున్నాసుట్టి

ఇంక నాదే పట్నమంటున్నవ్.

వారీ.. !

హైదరబాదంటే

నీ కండ్లల్ల సైబరు టవరు విడిచి

చారుమినారు మెరుస్తలే.

నీ కంటిచూపు హైటెక్ సిటీనే

ఓల్డుసిటీని చూస్తలే.

విల్లాలే గని గల్లీలు తెల్వవు నీకు

అవధానాలు గాక ఖవ్వాలీలు వింటవా నువ్వు.

వారీ..!

నువ్వు హైదరాబాదీవే కాకుండ

హైదరాబాదు నాదంటవేంది.

* * *

గమనిక: భారం కానన్నోద్దులూ.. భారతీయుడిగా ఏడైన ఉండొచ్చు.

No comments: